Sunday, 23 October 2016

LATEST TELUGU MOVIE "ISM" MOVIE REVIEW - 2016




TELUGU MOVIE "ISM" MOVIE REVIEW - 2016


సినిమా పేరు: ఇజం
బ్యానర్ : ఎన్టీఆర్ ఆర్ట్స్ 
Rating : 2.00 
విడుదలయిన తేది : Oct 21, 2016 

మేధావి అన‌ద‌గ్గ ద‌ర్శ‌కుల్లో పూరి ఒక‌డు. మాస్‌లోకి చొచ్చుకుపోయే విష‌యంలో, ఓ క‌థ‌ని అన్ని వ‌ర్గాల వారికీ న‌చ్చేట్టు తీర్చిదిద్దే విష‌యంలోనూ పూరి మేధావిత‌నం బ‌య‌ట‌ప‌డుతుంటుంది.  పూరి సినిమాల్లో హీరోలు అచ్చం మ‌న‌కు ప్ర‌తిబింబాలుగా ఊహించేసుకొనేలా మ్యాజిక్ చేయ‌డంలో.. పూరి ఆరితేరిపోయాడు. పూరి సినిమాల్లో న‌చ్చేసేది.. అత‌ని హీరోయిజ‌మే. దాంతో పూరి సినిమాలూ న‌చ్చేయ‌డం ప్రారంభిస్తాయి. అయితే హీరోయిజాన్ని ఎలివేట్ చేసేయ‌డంలో పెట్టిన శ్ర‌ద్ద క‌థ‌, క‌థ‌నాలు, మిగిలిన విష‌యాల్లో పూరి పెట్ట‌డ‌న్న విమ‌ర్శ బ‌లంగా వినిపిస్తోంది. ఆ లోపంతోనే... చాలాకాలంగా పూరిని ప‌రాజ‌యాలు వెన్నాడుతున్నాయి. మ‌రి.. `ఇజం`తో ఆ లోపాన్ని క‌ప్పిపుచ్చుకొన్నాడా, లేదా ఈసారీ దానికే దొరికిపోయాడా?  తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
* క‌థ‌
బ్యాంకాక్‌లోని ఓ దీవిలో క‌ల్యాణ్ రామ్ (క‌ల్యాణ్‌రామ్‌) ఇల్లీగల్ ఫైట‌ర్‌గా డ‌బ్బులు సంపాదించుకొంటుంటాడు. ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడించే మాఫియా డాన్ జావెద్ భాయ్‌ (జ‌గ‌ప‌తిబాబు) కూడా అదే దీవిని త‌న చీక‌టి సామ్రాజ్యానికి వేదిక‌గా చేసుకొంటాడు. జావెద్ ముద్దుల కూతురే...  అలియా (అతిథి ఆర్య‌).  త‌న తండ్రినే గ‌డ‌గ‌డ‌లాడించే వ్య‌క్తిని పెళ్లి చేసుకోవాల‌ని కోరుకొంటుంది. అలియాకి క‌ల్యాణ్ తార‌స‌డ‌తాడు. ప్రేమించ‌మ‌ని వేధిస్తాడు. ముందు ఇష్టం లేక‌పోయినా.. ఆ త‌ర్వాత‌ర్వాత క‌ల్యాణ్‌కి ద‌గ్గ‌ర‌వుతుంది. అయితే.. క‌ల్యాణ్ వ‌చ్చింది త‌న కోసం కాద‌ని, త‌న తండ్రిని ప‌ట్టించ‌డానికి అనే నిజం తెలుస్తుంది అలియాకు. నిజానికి క‌ల్యాణ్ అస‌లు పేరు.. స‌త్య మార్తాండ్‌. అత‌నో జ‌ర్న‌లిస్ట్‌. ఆ జ‌ర్న‌లిస్టూకీ జావెద్ భాయ్‌కీ ఉన్న లింకేంటి?  అస‌లు.. స‌త్య మార్తాండ్ ల‌క్ష్య‌మేంటి?  విదేశాల్లోని బ్యాంకుల్లో పేరుకుపోయిన ల‌క్ష‌ల కోట్ల న‌ల్ల‌ధ‌నాన్ని ఇండియా ఎలా తెప్పించాడు?   ఇవ‌న్నీ సినిమాచూసి తెలుసుకోవాల్సిందే.


ఎనాలసిస్ :

* విశ్లేష‌ణ‌
న‌ల్ల‌ధ‌నాన్ని భార‌త‌దేశం ర‌ప్పించి.. పేద‌ల క‌ష్టాల్ని తీర్చిన ఓ పాత్రికేయుడి క‌థ ఇది. పాయింట్ శంక‌ర్ సినిమాల లెవిల్లో బీభ‌త్సంగా ఉంది. అయితే... దాన్ని తెర‌కెక్కించిన విధానం మాత్రం అత్యంత సాదాసీదాగా ఉండ‌డం పూరి అభిమానుల్ని దారుణంగా నిరాశ ప‌రుస్తుంది. క‌ల్యాణ్ రామ్ ఓ పాత్రికేయుడ‌న్న సంగ‌తి.. ఈ సినిమా టికెట్ కొన్న ప్రేక్ష‌కుడికి ముందే తెలుసు. అయితే ఆ పాయింట్‌ని పెద్ద స‌ర్‌ప్రైజింగ్ ఎలిమెంట్‌లా.. విశ్రాంతికి ముందు రివీల్ చేశాడు పూరి. ఆ చిన్న పాయింట్ (అదీ తెలిసిందే) తెలుసుకోవ‌డం కోసం విశ్రాంతి వ‌ర‌కూ నిరీక్షించాన్న‌మాట‌. జావెద్ భాయ్ అక్ర‌మాల్ని క‌నిపెట్ట‌డానికి వ‌చ్చిన జ‌ర్న‌లిస్ట్ ... ఈ స‌త్య మార్తాండ్ అనే విష‌యం చెప్ప‌డానికి పూరి ఓ గంట సినిమాని య‌దేచ్ఛ‌గా వాడుకోవ‌డం క్ష‌మించ‌రాని నేరం. ఆ గంట గొప్ప‌గా సాగిందా అంటే అదేం లేదు. ల‌వ్ ట్రాక్ చూస్తే... పూరి తీసిన పాతిక సినిమాలు గుర్తొస్తాయి. ఇంట్ర‌వెల్ బ్యాంగ్ అతి సాదాసీదాగా ఉంది. దాంతో తొలిభాగంతోనే ప్రేక్ష‌కుడికి బోర్ కొట్ట‌డం ప్రారంభ‌మ‌వుతుంది. సెకండాఫ్‌ని ప్రారంభించిన విధానం... దాన్ని న‌డిపిన ప‌ద్ద‌తి కూడా ఆస‌క్తిక‌రంగా ఉండ‌వు. అప్ప‌టి వ‌ర‌కూ డాన్‌కూతురిలా ద‌ర్జా వెల‌గ‌బెట్టిన హీరోయిన్ స‌డ‌న్‌గా ప్లేటు మార్చి.. హీరో కోసం క‌న్నీళ్లు పెట్టుకొంటూ, ఓ పేథాస్ సాంగ్ వేసుకోవ‌డం ఏమాత్రం అత‌క‌లేదు. పూరి న‌మ్ముకొన్న‌ది చివ‌రి 10 నిమిషాల సినిమా. స్వాతంత్య్రానికి ముందు ఈ దేశాన్ని తెల్ల‌వాళ్లు దోచుకొంటే.. ఆ త‌ర‌వాత న‌ల్ల‌వాళ్లు దోచుకొంటున్నారు... అన్న అరిగిపోయిన డైలాగ్ చెప్ప‌డానికి రెండు గంట‌ల కూర్చోబెట్టేశాడు పూరి.
న‌ల్ల‌ధ‌నాన్ని హ్యాక‌ర్లు.. ట్రాప్ చేయ‌డం... దాన్ని దేశంలోని పేద ప్ర‌జ‌లందరి ఖాతాల్లోకి మ‌ల్లించ‌డం.. ఇవ‌న్నీ విన‌డానికి బాగున్నా, లాజిక్‌కి అంత‌నంత దూరంలో ఉన్న విష‌యాలు.  ఓ పాయింట్ చెప్పాల‌నుకొన్న‌ప్పుడు దాని కోసం గ్రౌండ్ వ‌ర్క్ బాగా చేయాలి. కానీ.. పూరికి అంత ఓపిక‌, తీరిక లేవు. వికీలీక్స్ అనే పాయింట్ పూరి క‌థ‌కు బాగా ఉప‌యోగ‌ప‌డింది. అయితే దాన్ని సినిమాగా మ‌లిచేందుకు చేయాల్సిన క‌స‌ర‌త్తులు మాత్రం పూరి చేయ‌లేదు. బ‌ల‌మైన విల‌న్ లేక‌పోవ‌డం, పాయింట్ సినిమా ప్రారంభంలోనే అర్థ‌మైపోవ‌డం, ముగింపు ప‌లికిన విధానం కూడా అసంతృప్తిగానే ఉండ‌డంతో `ఇజం`... ల‌క్ష్యం నెర‌వేర‌కుండా పోయాయి.
* న‌టీన‌టుల ప్ర‌తిభ‌
క‌ల్యాణ్ రామ్ న‌ట‌న కొత్త‌గా అనిపిస్తుంది. అది క‌ల్యాణ్ రామ్ వ‌ర‌కూ మాత్ర‌మే. ఎందుకంటే ఈ టైపు హీరోయిజం చూడ‌డం పూరి సినిమాలు రెగ్యుల‌ర్‌గా చూసేవాళ్ల‌కు అల‌వాటే. పూరి సినిమాల్లో హీరో ఏం చేస్తాడో, ఎలా చేస్తాడో తెలిసిన వాళ్ల‌కు ఇదేం కొత్త‌గా అనిపించ‌దు. అతిథి చూడ్డానికి బాగున్నా... ఆమె క్యారెక్ట‌రైజేష‌న్ ఏమంత గొప్ప‌గా అనిపించ‌దు. మేల్ లుక్స్‌.. మేల్ బాడీ లాంగ్వేజ్‌తో అమ్మాయిల్లో ఉండాల్సిన సున్నిత‌త్వం పోయాయి. జ‌గ‌ప‌తిబాబు పేరుకు మాత్ర‌మే గొప్ప డాన్‌. ఈసినిమాలో ఆయ‌న‌తో వేయించిన‌వ‌న్నీ జోక‌ర్ వేషాలే. పోసానిది రెగ్యుల‌ర్ పాత్ర‌. అలీ కామెడీ పండ‌లేదు. వెన్నెల కిషోర్ ఉన్నా ఉప‌యోగం లేదు.
* సాంకేతిక వ‌ర్గం
అనూప్‌తో స‌హా.. సాంకేతిక నిపుణులంతా బాగానే క‌ష్ట‌ప‌డ్డారు. అయితే ఫ‌లితం లేదు. కెమెరా వ‌ర్క్ బాగుంది. బ్యాంకాక్‌లో ఇంకా మిగిలిపోయిన లొకేష‌న్లేం లేవ‌నుకొంటా. పూరి అన్నీ చూపించేశాడు ఈ సినిమాతో. ద‌ర్శ‌కుడిగా పూరి... యావ‌రేజ్ మార్కులు తెచ్చుకొంటే.. రైట‌ర్‌గా ఓకే అనిపిస్తాడు. అరె.. భ‌లే చెప్పాడు అనిపించిన డైలాగ్‌, భ‌లే తీశాడు అనుకొన్న సీన్ ఒక్క‌టీ లేవు.

No comments:

Post a Comment